Published : 28/09/2022 18:28 IST

ఏమేమి పువ్వప్పునే.. గౌరమ్మ..!

ఏమేమి పువ్వప్పునే.. గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే.. అంటూ తెలంగాణ ఆడపడుచులంతా కలిసి బతుకమ్మను కొలిచే వేళ.. పండగ హేళ వెల్లివిరుస్తోంది. పూర్వకాలంలో ప్రకృతితో మమేకమై తమ చుట్టుపక్కల దొరికే పూలన్నింటినీ సేకరించి వాటిని బతుకమ్మగా పేర్చేవారు. ఆ బతుకమ్మను ఆడి తర్వాత నీటిలో నిమజ్జనం చేసేవారు. అయితే.. ప్రస్తుతం కాలం మారిపోయి.. మనకు బజార్లో దొరికే పూలతోనే బతుకమ్మ తయారు చేసేసి ఆడుకుంటున్నాం.

ఒక రకంగా చూస్తే బతుకమ్మకు ప్రకృతిపరంగానూ ప్రాముఖ్యం ఉంది.. వర్షాకాలం బాగా వర్షాలు పడి, పూలు విరగబూసి ఉంటాయి.. ఆ పూలలో చాలా ఔషధ గుణాలూ ఉంటాయి. ఈ పూలన్నింటినీ తెచ్చి బతుకమ్మ ఆడి నీటిలో కలపడం వల్ల వాటిలోని ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి.. ఇలా.. మన పెద్దవాళ్లు వాళ్లకు తెలియకుండానే ప్రకృతి తమకోసం అందించిన సహజసిద్ధమైన ఔషధాలను ఉపయోగించుకునేవారు..

ఇంతకీ విషయానికొస్తే.. బతుకమ్మ తయారు చేయడానికి ఈ పువ్వూ ఆ పువ్వూ అని లేకుండా.. గడ్డి పువ్వు దగ్గర్నుంచి మన చుట్టూ దొరికే ప్రతి పువ్వూ ఉపయోగించవచ్చు. అయితే సాధారణంగా మన పెద్దవాళ్లు.. కొన్ని రకాల పూలను మాత్రం తప్పనిసరిగా ఉపయోగించేవాళ్లు.. అవేంటంటే..

తంగేడు

'తంగేడు పువ్వప్పునే.. గౌరమ్మ.. తంగేడు కాయప్పునే..' అంటూ ఓ బతుకమ్మ పాట కూడా ఉంది.. దీని ద్వారానే తెలిసిపోతోందిగా బతుకమ్మ తయారు చేయడంలో తంగేడు పూలకున్న ప్రత్యేకత ఏంటో.. మన దగ్గర ఎన్ని రకాల పూలున్నా.. తంగేడు పువ్వు లేకపోతే బతుకమ్మ పూర్తవనట్టే అంటారు కొంతమంది.. బతుకమ్మలో కనీసం ఒక్క తంగేడు పువ్వైనా తప్పనిసరిగా ఉండాల్సిందేనట. పచ్చని రంగులో మెరిసిపోయే ఈ పువ్వు బతుకమ్మకు చక్కని రంగునిస్తుంది.


గునుగు

దీన్నే గునుక పువ్వు అని కూడా అంటారు. తెల్లగా, పొడుగ్గా ఉండే ఈ పువ్వునూ బతుకమ్మ తయారీలో ఎక్కువగా వాడతారు. కేవలం తెల్లని పూలనే కాదు.. వాటికి రంగులద్ది రంగురంగుల పూలనూ బతుకమ్మలో వాడటం చాలాచోట్ల కనిపిస్తుంది. దీనికి రంగు ఎలా అద్దాలంటే.. ముందుగా పూలను తీసుకొని వాటిని మధ్యకు విరుచుకోవాలి. పైభాగాన్ని బతుకమ్మ మధ్యలో వేయడానికి ఉపయోగించుకోవచ్చు.. కాడతో సహా ఉన్న కింది భాగాన్ని పేర్చడానికి ఉపయోగించాలి. మనకు కావాల్సిన రంగులో కొద్దిగా నీళ్లు పోసి, వాటిలో పూలను రుద్దాలి. దీంతో ఆ రంగు పూలకు అంటుకుంటుంది. వీటిని కాస్త ఆరబెట్టి ఆ తర్వాత ఉపయోగించుకోవచ్చు.


పట్టుకుచ్చు పువ్వు

వీటినే కొన్ని చోట్ల సీతమ్మ జడ పూలు అని కూడా అంటారు. వెల్వెట్ క్లాత్‌లా చాలా మృదువుగా కనిపించే ఈ పూలు మంచి రంగుతో అందంగా మెరిసిపోతుంటాయి. బతుకమ్మలో పేరిస్తే మంచి శోభనిస్తాయి.


బంతి

బతుకమ్మ పండగొచ్చిందంటే చాలు.. బంతి పూలతోనే శోభంతా..! పండగలో చాలామంది ఎక్కువగా ఈ పూలనే ఉపయోగిస్తూ ఉంటారు. పల్లెల నుంచి పట్టణాల వరకూ ఎక్కడైనా ఇట్టే దొరికే ఈ పూలు ముద్దగా, అందంగానూ ఉంటాయి.. వీటిలోని వివిధ రకాల రంగులను వేర్వేరు వరుసల్లో ఉపయోగిస్తారు.


చామంతి

బతుకమ్మ తయారు చేయడంలో బంతి తర్వాత స్థానం చామంతిదే.. ఈ సీజన్‌లో బాగా దొరికే పూలు ఇవే కాబట్టి వీటిని బతుకమ్మలో ఎక్కువగా వాడుతుంటారు.

 


మందార

ఎర్రటి మందార బతుకమ్మకు చక్కటి శోభను తీసుకొస్తుంది. ఒకే రెక్కతో ఉండే మందారాన్నైతే అన్నింటికంటే పైవరుసలో, ముద్ద మందారాన్నైతే కాంబినేషన్‌ని బట్టి బంతిపూలకు పై వరుసలో లేదా కింద ఉపయోగిస్తూ ఉంటారు.


గులాబీ

మందార పూలు దొరకకపోతే మంచి కాంబినేషన్ కోసం గులాబీలను కూడా ఉపయోగించుకోవచ్చు.


గన్నేరు

వీటిని కూడా బతుకమ్మ తయారీలో ఉపయోగించచ్చు. ముద్దగా ఉండే పూలైతే ఇంకా అందంగా ఉంటాయి.


నందివర్ధనం

తెల్లతెల్లని నందివర్ధనంతో అలంకరించిన బతుకమ్మ చక్కటి సువాసన వెదజల్లడమే కాదు.. అందంగానూ కనిపిస్తుంది. అందుకే నందివర్ధనాన్ని ఎక్కువమంది బతుకమ్మ కోసం వాడుతూ ఉంటారు.

 


కూరగాయ పూలు

మామూలు పూలతో పాటు కూరగాయ మొక్కలైన గుమ్మడి, బీర, సొర కాయలాంటి పూలను కూడా ఉపయోగిస్తారు.

వీటితో పాటు గడ్డిపూలు, చిట్టి చామంతి పూలు, జిల్లేడు పూలు, స్వర్ణ గన్నేరు, కాశీరత్నం పూలు, కలువపూలు.. ఇలా.. మనకు నచ్చిన పూలు కూడా బతుకమ్మ అలంకరణలో ఉపయోగించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్