Updated : 13/03/2023 09:31 IST

పోటీల కోసం.. సీఏ పక్కనపెట్టి

ట్రయథ్లానా.. ఒకేసారి రన్నింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగా.. మధ్యలో దుస్తులు ఎక్కడ మార్చుకుంటారు?  - స్పాన్సర్‌షిప్‌ కోసం వెళ్లినప్పుడు ప్రజ్ఞ్యకి ఎదురైన ప్రశ్న ఇది!

సైకిల్‌.. ఇంటి దగ్గర తొక్కొచ్చుగా? రోడ్లమీదకి ఎవరు రమ్మన్నారు? అమ్మాయి అయ్యుండి ఈ దుస్తులేంటి? - సైక్లింగ్‌ సాధన చేస్తుండగా యాక్సిడెంట్‌ అయినప్పుడు.. చుట్టూ ఉన్నవాళ్ల సంభాషణ ఇది!

ఈ సంఘటనలే ప్రజ్ఞ్యాలో నిరూపించుకోవాలన్న కసిని పెంచాయి. గెలుపుతోనే మరింతమందికి తన క్రీడను పరిచయం చేయాలనుకుంది. ఆ తపనే ఈ ఏడాది ఐఓసీ యంగ్‌ లీడర్‌ ప్రోగ్రామ్‌కీ ఎంపికయ్యేలా చేసింది. ప్రజ్ఞ్యా మోహన్‌.. ఎవరీమె?

ఆటలు.. ఒకప్పుడు ప్రజ్ఞ్య లక్ష్యం కాదు. ఆరోగ్య సంరక్షణ మార్గాలంతే. తర్వాతే ఆ నిర్ణయం మార్చుకుంది. పుట్టింది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌. రెండేళ్లకే ఈత మొదలుపెట్టింది. దానిలో ఆమె ప్రావీణ్యం చూసి, నిపుణులతో శిక్షణిప్పించారు. ఎనిమిదేళ్లకే పోటీల్లో పాల్గొన్న ప్రజ్ఞ్య ఆపై రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో రాణించింది. నాన్న, అన్నయ్య మారథాన్‌ రన్నర్‌లు. ఫిట్‌నెస్‌ కోసమని వాళ్లతో కలిసి సాధన చేసేది. ఓసారి స్కూల్లో సరదాగా పాల్గొంటే రెండో స్థానంలో నిలిచింది. దాంతో దీనిపైనా ఆసక్తి ఏర్పడింది. 2008లో స్మిమ్మింగ్‌, రన్నింగ్‌లను కలిపి నిర్వహించే ఆక్వాథ్లాన్‌ పోటీల గురించి విని పాల్గొంది. జాతీయస్థాయిలో పతకం సాధించింది. ఇంటి నుంచి స్కూలు కాస్త దూరం. దీంతో సైకిల్‌ కొనుక్కుంది. అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సైకిల్‌ రేస్‌ పెడితే పాల్గొంది. ఆ గెలుపుతో ఎక్కడ రేసులు జరిగినా పాల్గొనేది. అలా 127 రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లు గెలిచింది. 2013లో ఆక్వాథ్లాన్‌ గెలిచిన తనకు ట్రయథ్లాన్‌ గురించి తెలిసింది. అలా మూడింటినీ సాధన చేస్తూ వచ్చింది. మొదట్నుంచీ నాన్నే కోచ్‌. నిపుణుల శిక్షణ అవసరమనిపించి స్పాన్సర్‌షిప్‌ కోసం ప్రయత్నిస్తే దీని గురించి తెలిసినవారే తక్కువ. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధిస్తేనే గుర్తింపు సాధ్యమని నమ్మింది ప్రజ్ఞ్య. 2015 నుంచి నేపాల్‌లో సౌత్‌ ఏషియన్‌ ట్రయథ్లాన్‌లతోపాటు నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ల్లోనూ పతకాలు గెలిచింది. ట్రయథ్లాన్‌ వరల్డ్‌కప్‌లో దేశం నుంచి పాల్గొన్న మొదటి అథ్లెట్‌ కూడా. 2022లో నేషనల్‌ సీ స్విమ్మింగ్‌, సైక్లింగ్‌ పోటీల్లో గెలిచింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ పోటీ పడింది.

ఈ క్రమంలో ఎన్నో ఆక్సిడెంట్లు. శస్త్రచికిత్సలూ జరిగాయి. అయినా మరింత మందికి దీన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. తన కృషికి గుర్తింపుగా ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) యంగ్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కి ఎంపిక చేసింది. ప్రపంచవ్యాప్తంగా భిన్న వడపోతల తర్వాత 25 మందిని ఎంపిక చేస్తే వారిలో ప్రజ్ఞ్య ఒకరు. ‘ఈ ప్రోగ్రామ్‌ ద్వారా మారుమూల గ్రామాల్లోని అమ్మాయిలకు సైకిళ్లు అందివ్వాలనుకుంటున్నా. దూరం కారణంగా వాళ్లు చదువు మానేయకూడదనేది నా ఉద్దేశం. రేసుల్లో పాల్గొనేలా శిక్షణా ఇవ్వాలనుంది. నా విషయంలో.. ఈ ఏడాది 15 అంతర్జాతీయ రేసుల్లో పాల్గొనబోతున్నా. ఒలింపిక్స్‌కి అర్హత సాధించడం లక్ష్యం’ అంటోన్న 27 ఏళ్ల ప్రజ్ఞ్య సీఏ పూర్తిచేసింది. ఒలింపిక్స్‌లో బంగారు పతకం కోసం కెరియర్‌ని పక్కనపెట్టి విదేశాల్లో సాధన చేస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి